రాజకీయ కక్షతో అక్రమ కేసులు
● మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
● పిన్నెల్లి సోదరులతో ములాఖత్
నెల్లూరు రూరల్: వ్యవస్థలను పనిచేయనీయకుండా.. రాజకీయ కక్షతో కేసులు, వేధింపుల పరంపరను టీడీపీ ప్రభుత్వం సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడితో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జూదాలు, కోడి పందేలు, ఆన్‌లైన్ గేమ్స్‌కు ప్రభుత్వం అనుమతిచ్చి ఆదాయం కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. ఏ తప్పూ చేయని వారిని కేసుల్లో అక్రమంగా ఇరికించి జైళ్లలో బంధిస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలే పేర్కొనడం సర్కార్ వికృత చేష్టలకు పరాకాష్టగా అభివర్ణించారు. అనంతరం కాసు మహేష్‌రెడ్డి మాట్లాడారు. ఆధిపత్యం కోసం టీడీపీ వారే గొడవపడి చంపుకొంటే ఆ కేసును పిన్నెల్లి సోదరులపై బనాయించడం దుర్మార్గమన్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ వెల్లడించారని, అయితే అక్రమంగా కేసు పెట్టడం దారుణమని చెప్పారు. పిన్నెల్లి సోదరులు ఎంతో ధైర్యంగా ఉన్నారని వివరించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పల్నాడు జిల్లా కార్యకర్తల కోసం నిలుస్తామని, తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను విడనాడి ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. జైలు మాన్యువల్ మేరకు అధికారులు పనిచేయడంలేదని గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. బయట భోజనానికి కోర్టు అనుమతిస్తే, అధికారులు మాత్రం ఇవ్వడంలేదని విమర్శించారు.


