ఇతర రాష్ట్రాల్లో కార్ల చోరీలు
● నంబర్ ప్లేట్లు, రికార్డులు మార్చి అమ్మకాలు
● ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
● ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
● పరారీలో ప్రధాన నిందితుడు
నెల్లూరు(క్రైమ్): ఇతర రాష్ట్రాల్లో చోరీ చేసిన కార్లకు నంబర్ ప్లేట్లు మార్చి, నకిలీ రికార్డులతో విక్రయిస్తున్న ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.1.20 కోట్ల విలువైన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అజిత వేజెండ్ల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి (ప్రధాన నిందితుడు)కి బీవీ నగర్‌కు చెందిన కార్ల గ్యారేజీ నిర్వాహకుడు టి.శివ, తిరుపతిలోని ఓ కార్ల షోరూమ్‌లో పనిచేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన పి.లక్ష్మణ్ కుమార్‌లు స్నేహితులు. వారు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుడు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కార్లను చోరీ చేసి నెల్లూరుకు తీసుకొచ్చి శివ గ్యారేజ్‌లో ఉంచేవాడు. శివ, లక్ష్మణ్ కుమార్‌ల సహాయంతో ఆ కార్ల నంబర్ ప్లేట్లను మార్చి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నంబర్ ప్లేట్లు అమర్చేవారు. నకిలీ రికార్డుల జెరాక్స్ కాపీలను ఉపయోగించి సాధారణ వాహనాలుగా చూపిస్తూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరలకే విక్రయించి సొమ్ము చేసుకోసాగారు.
తనిఖీలు చేస్తుండగా..
సోమవారం దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు తన సిబ్బందితో కలిసి అన్నమయ్య సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఒక కారులో శివ, లక్ష్మణ్ కుమార్‌లు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి ఐదు కార్లను స్వాధీనంచేసుకున్నారు. ఢిల్లీ, న్యూఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కార్ల దొంగతనాలపై ఇప్పటికే కేసులున్నాయి. ప్రధాన నిందితుడు ఓ కానిస్టేబుల్ భర్త అని తెలిసింది. వివరాలు తెలిసినా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదుపులోకి తీసుకుంటే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు, ఎస్సై వి.బ్రహ్మయ్య, క్రైమ్ పార్టీ సిబ్బంది వేణు, మహేంద్ర, ఖాజా, శామ్యూల్ తదితరులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.


