చిట్స్‌ పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

చిట్స్‌ పేరుతో మోసం

Jan 13 2026 6:10 AM | Updated on Jan 13 2026 6:10 AM

చిట్స్‌ పేరుతో మోసం

చిట్స్‌ పేరుతో మోసం

పోలీసులకు బాధితుల వినతి

నెల్లూరు(క్రైమ్‌): చిట్స్‌ పేరిట మోసగించిన నిర్వాహకురాలు, ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరు మండలం దువ్వూరుపాళెం, డమ్మాయిపాళేనికి చెందిన పలువురు బాధితులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ పొదుపు లీడర్‌గా అందరికీ పరియస్తురాలన్నారు. ఆమె కొంతకాలంగా చిట్స్‌ నిర్వహిస్తోందన్నారు. తాము ఆమె వద్ద చిట్స్‌ వేశామన్నారు. కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో నిలదీయగా పొలం అమ్మి డబ్బులు ఇస్తామని చెప్పిందన్నారు. ఈనెల 6వ తేదీన పొలం అమ్మినా డబ్బులు ఇవ్వకుండా అదేరోజు రాత్రి కుటుంబంతో సహా ఎటో వెళ్లిపోయిందన్నారు. ఆమె తమ్ముళ్లను అడిగామన్నారు. సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. పొదుపు, చిట్స్‌ పేరిట సుమారు రూ.80 లక్షల వరకు ఆమె మోసగించిందని బాధితులు ఆరోపించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏవీ చలం, మహేష్‌, రాము, హరికృష్ణ, రాజయ్య తదితరులున్నారు.

మతోన్మాద దాడులను అరికట్టాలి

నెల్లూరు(దర్గామిట్ట): మతోన్మాద దాడులను అరికట్టాలని వివిధ సంఘాలు, పార్టీల నేతలు కోరారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే విధానాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ సతీష్‌, మీదూరు కల్యాణ్‌ సుందర్‌, కలివెల ఎలిషా, జానీజు, సీహెచ్‌ సులోచనామరి, షేక్‌ జాన్సన్‌ పాస్టర్‌, కె.డేవిడ్‌ పాల్గొన్నారు.

జ్యోతికి అండగా ఉంటాం

చిల్లకూరు: ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోయిన జ్యోతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జిల్లా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ లీగల్‌ కౌన్సెలర్‌ ఎన్‌.ప్రశాంతి తెలిపారు. మండలంలోని బూదనం గ్రామంలో యువకుడి ఇంట్లో ఉన్న జ్యోతిని సోమవారం ఐసీడీఎస్‌ అధికారులు, లీగల్‌ సెల్‌ వారు కలిసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతి మాట్లాడుతూ వాకాడు మండలం కొండాపురానికి చెందని జ్యోతి ఓ పరిశ్రమలో పనిచేసే సమయంలో బూదనం గ్రామానికి చెందిన జగదీష్‌ పరిచయమైనట్లు చెప్పారు. అతడికి కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దమవడంతో జ్యోతి నిరసన చేపట్టిందన్నారు. దీంతో జగదీష్‌ కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో జ్యోతి అక్కడే ఉంటోందని, ఆమె పరిస్థితి ఆందోళనగా ఉండటంతో పీడీ హేనాసుజన్‌ ఆదేశాలతో మాట్లాడామన్నారు. చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గతంలోనే ఆమె ఇచ్చిన ఫిర్యాదును విచారణ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ మహబూబీ, వన్‌ స్టాప్‌ సెంటర్‌ కేస్‌ వర్కర్‌ పి.శారద, సూపర్‌వైజర్‌ నాగిశెట్టి రేణుక, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement