పీజీఆర్‌ఎస్‌కు 105 ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 105 మంది విచ్చేసి తమ సమస్యలపై ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆమె పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్, ఎస్‌బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, బాలాజీ నగర్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు సాంబశివరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● నా కుమార్తె 2024లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరణానికి గల కారణాలు తెలుస్తాయని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చారు.
● చిత్తూరుకు చెందిన మహేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.85 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, తీసుకున్న నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● శ్రీనివాసులు మరికొందరు నా ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని దగదర్తికి చెందిన వృద్ధ దంపతులు కోరారు.
● నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్నాను. భార్య, కుమారులు పట్టించుకోవడం లేదు. జీవనోపాధి సైతం ఇబ్బందిగా ఉందని పొదలకూరుకు చెందిన వినతిపత్రమిచ్చాడు.
● నా కుమార్తె కనిపించడం లేదు. నా ఫిర్యాదు మేరకు మనుబోలు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కుమార్తె ఆచూకీ కనుక్కోవాలని మనుబోలుకు చెందిన ఓ మహిళ కోరారు.


