గిరిజనులపై ‘కూటమి’ కపటప్రేమ
నెల్లూరు రూరల్: గిరిజనులపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని మాజీ మేయర్ భర్త పి.జయవర్ధన్ ఆరోపించారు. సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్‌గా గిరిజన వ్యక్తికి అవకాశం కల్పించకుండా ఇన్‌చార్జి మేయర్‌నే కొనసాగించడం సిగ్గుచేటన్నారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటారని, ఇది కపటప్రేమ కాదా అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గిరిజనుల ఓట్లతో గెలిచారన్నారు. మీ అనుచరుడి కళ్లలో ఆనందం కోసం గిరిజనులకు అన్యాయం చేయడం సబబేనా అని ప్రశ్నించారు. నెల్లూరు నడిబొడ్డున జరుగుతున్న అన్యాయం మీకు కనిపించడం లేదా అని సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుగజేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో గిరిజన వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వకపోతే పోరాటం చేస్తామన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.


