వైఎస్సార్సీపీ సత్తా చాటుదాం
జగనన్న సైన్యం ఏర్పాటు
నెల్లూరు రూరల్ / నెల్లూరు(అర్బన్): త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎలక్షన్లలో విజయదుందుభి మోగించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదామని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయమై ముఖ్య నేతలు తదితరులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్లో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం, వార్డులో పార్టీని బలోపేతం చేసేందుకు గానూ కమిటీలను ఫిబ్రవరి 15లోపు ఏర్పాటు చేయాలని సూచించారు. చురుకై న వారిని గుర్తించి ఇందులో నియమించాలని కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు పూర్తయ్యాయని వివరించారు. గ్రామ, వార్డు స్థాయి నేతలను నియమించాలని, వీరందరికీ పార్టీ గుర్తింపు కార్డులను ఇవ్వనున్నామని తెలిపారు.
వివరాల డిజిటలైజేషన్
వివరాలను డిజిటలైజేషన్ చేయనున్నామని, ఇలా ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది వేల మంది నేతలు తయారుకానున్నారని మిథున్‌రెడ్డి చెప్పారు. పరిశీలకులకు జగనన్న నేరుగా ఫోన్ చేసి నేతలు, డిజిటలైజేషన్ వివరాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. కార్యకర్తల్లేనిదే పార్టీలేదని, కేడర్‌కు జగనన్న అండగా నిలుస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించేలా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఐక్యంగా పనిచేసి ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ ఫలితమే..
విద్య, వైద్యాన్ని పేదలకు అందించేందుకు తమ పార్టీ అధినేత కృషి చేస్తున్నారని మిథున్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం పూనుకుందని, అయితే తమ ఉద్యమ ఫలితంగా టెండర్ వేసేందుకు ఒక్కరూ ముందుకురాలేదని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ శ్రేణులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించా రు. వీరి అరాచకాలకు తగిన బదులివ్వడం ఖాయమని స్పష్టం చేశారు.
ఐదంచెలుగా కమిటీలు
జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిలతో పాటు సోషల్ మీడియా ఇలా ఐదంచెలుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నామని పార్టీ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి శివశంకర్‌రెడ్డి తెలిపారు. గ్రామాధ్యక్షులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని సూచించారు.
గడువుకు ముందే కమిటీలు
జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన గడువుకు ముందే గ్రామ కమిటీలను పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పార్టీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, తిరుపతి ఎంపీ గురుమూర్తి కాంక్షించారు. సమస్యొస్తే అప్పుడు పోరాడేందుకు సులభంగా ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని కోరారు.
కార్యకర్తలే కీలకం
రానున్న తమ పార్టీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలే కీలకమని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా..
అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్థానాలను పార్టీ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జగన్‌ను మరోసారి సీఎం చేయాలి
ప్రతి ఇంట్లో జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులున్నా రని, వీరిని పార్టీలో భాగస్వాములను చేయాలని పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమన్వయంతో ముందుకుసాగాలి
పంచాయతీ నుంచి జిల్లా కమిటీల వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ మేరిగ మురళి సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వనున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి కోరారు. పలు అంశాలపై ఉదయగిరి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జీలు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడారు.
గ్రామస్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు
కార్యకర్తలకు ఉచిత బీమా
టీడీపీ పాలనలో జరిగే
అరాచకాలకు బదులిస్తాం
పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి
వైఎస్సార్సీపీ సత్తా చాటుదాం


