పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు
● ఎస్సై న్యాయం చేయడంలేదంటూ బాధితుల ఆందోళన
వింజమూరు (ఉదయగిరి): పట్టణంలోని వివిధ చోరీ కేసుల్లో తమ బంగారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులు.. తమకు పోలీసులు న్యాయం చేయడంలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు. పట్ణణంలోని యర్రబల్లిపాళెంలో ఓ ఇంట్లో జాతకం చెప్పేందుకొచ్చి బంగారం, డబ్బులతో ఉడాయించిన అనుమానితులను పట్టుకొని వదిలేయడమే కాకుండా, మీరే దొంగతనం చేశారంటూ ఎస్సై తమను అవమానిస్తున్నారంటూ బాఽధితులు మౌనిక, సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం చోరీ, మేకల అపహరణ కేసు విషయంలోనూ ఎస్సై దురుసుగా ప్రవర్తిస్తూ, తమకు న్యాయం చేయలేదని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. బాధితులు బైఠాయించడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎస్సై వీరప్రతాప్ బయటకొచ్చి, ట్రాఫిక్‌ను క్లిరయిర్ చెయించారు. మీ కేసును నెల్లూరు లోని క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారని, అక్కడికెళ్లాలని సూచించారు. దీంతో బాఽధి తులు కొద్దిసేపు అక్కడే ఉండి ఆపై వెళ్లిపోయారు. కాగా ఈ విషయమై ఎస్సైను సంప్రదించగా, కేసులు దర్యాప్తులో ఉన్నాయని, పలువురు నిందితులను విచారిస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చర్యలు చేపడతామని బదులిచ్చారు.


