అక్రమ కేసులతో నిర్బంధం
● తిరుపతి ఎంపీ గురుమూర్తి
● కేంద్ర కారాగారంలో పిన్నెల్లి సోదరులతో ములాఖత్
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులను ప్రభుత్వం మోపి జైల్లో నిర్బంధిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడితో గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, ప్రభుత్వ కుట్రలకు త్వరలో తెరపడుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కుట్రపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతరం మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. జైల్లో సరైన భోజనాన్ని అందించడంలేదని, ఈ తరుణంలో హోంమంత్రి ఎందుకొచ్చారో.. ఎవరితో మాట్లాడారో అర్థం కావడంలేదని చెప్పారు.


