ఔటర్ రింగ్ రోడ్డు.. ఔట్
తప్పుదోవ పట్టిస్తున్న పచ్చ నేతలు
రియల్టర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకే ప్రకటన
● కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన సమీక్ష.. తూచ్ ఉత్తుత్తిదే
● అవసరమని నుడా చైర్మన్.. అక్కర్లేదని మంత్రి నారాయణ ప్రకటనలు
● ఎవర్ని మభ్యపెట్టేందుకు
ఈ నాటకమంటున్న ప్రజలు
నెల్లూరు సిటీ: నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు కానుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనికి సంబంధించి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో ఇటీవల సమీక్షించారు. ఇలా నెల్లూరు ప్రజలకు ఎంతో ఆశ కలిగించారు. జిల్లా వాసులకు ట్రాఫిక్ కష్టాలుండవని.. హైదరాబాద్ తరహాలో నెల్లూరులోనూ ప్రయాణించొచ్చంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. సరిగ్గా నాలుగు రోజులు తిరిగేసరికే దీన్ని మంత్రి నారాయణ తుస్సుమనిపించారు. నెల్లూరుకు ప్రస్తుతం ఓఆర్‌ఆర్ అవసరమేలేదని ఆదివారం ఆయన తేల్చిచెప్పారు. దీన్ని నిర్మించాలంటే రూ.రెండు వేల కోట్లు ఎలా వస్తాయని.. భూసేకరణకు ఇబ్బందులొస్తాయని తేల్చేశారు. ఫలితంగా ఓఆర్‌ఆర్ అనేది బూటకమనే విషయం తేలిపోయింది.
కమీషన్లు దండేందుకేనా..?
జిల్లాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. విక్రయాలు, కొనుగోళ్లు దాదాపు ఆగిపోయాయి. రియల్టర్లు నీరసించిపోయారు. ఈ తరుణంలో ఔటర్ రింగ్ రోడ్డు అని మభ్యపెట్టి కృత్రిమ బూమ్‌ను సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు యత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రియల్టర్ల నుంచి భారీగా కమీషన్లు పొందేందుకు పన్నాగం పన్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
ఎందుకయ్యా.. ఈ డ్రామాలు..?
కోవూరు నియోజకవర్గంలో 41.44.. సర్వేపల్లి నియోజకవర్గంలో 20.94.. నెల్లూరు రూరల్‌లో 19.64 కిలోమీటర్ల పరిధిలో రూ.1930 కోట్లతో ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నామని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అయితే మంత్రి నారాయణ దీనికి భిన్నంగా స్పందించారు. నగరంలో గతంలో ట్రంకురోడ్డు మాత్రమే బైపాస్ రోడ్డుగా ఉండేదని, అప్పట్లో ట్రాఫిక్ భారీగా పెరిగిందని.. ఈ తరుణంలో మినీబైపాస్, నేషనల్ హైవేలొచ్చాయని.. సిటీలో రెండు అండర్ పాస్‌లు రానున్నాయని, రెండు ఫ్లయ్‌ఓవర్లున్నాయని తెలిపారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని, ఇప్పట్లో రింగ్ రోడ్డు అవసరమే లేదని, అసలీ విషయం తమ అజెండాలోనే లేదని చెప్పేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భూసేకరణకు నిధులెలా వస్తాయని ప్రశ్నించారు. దీంతో ఇదంతా బూటకమనే విషయం తేలిపోయింది.
ఓఆర్‌ఆర్ పేరుతో ప్రజలను కొంతమంది టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ భూముల విలువను అమాంతం పెంచుకునేందుకే ఈ పన్నాగం పన్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ది పనులు చేయకపోగా, ఊహల్లో విహరించేలా చేయడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా వట్టి మాటలను కట్టిపెట్టి.. చేతల్లో అభివృద్ధిని చూపాలని.. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజలే అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్తారంటున్నారు.


