దాడి ఘటనపై పునర్విచారణ జరపాలి
● నిందితుల పేర్లను కేసులో చేర్చాలి
● దర్గామిట్ట పోలీసులకు ప్రసన్న వినతి
నెల్లూరు(లీగల్): తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పునర్విచారణ జరిపి నిందితుల పేర్లను కేసులో చేర్చడంతో పాటు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేగవంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కల్యాణరాజుకు వినతిపత్రాన్ని ఆదివారం ఆయన అందజేశారు. అందులోని వివరాల మేరకు.. రాజకీయ విభేదాలతో గతేడాది జూలై ఏడున వంద మందికిపైగా వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కర్రలు, మారణాయుధాలతో ఆస్తి నష్టం, బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దాడి వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్ ప్రోత్సాహం, కుట్ర ఉందంటూ అప్పట్లోనే దర్గామిట్ట పోలీసులకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ క్రైమ్ నంబర్ 125 / 2025 కేసును నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో పొందుపర్చిన ప్రధాన నిందితులు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును పునర్విచారణ చేయాలంటూ ఆదేశాలను గతేడాది డిసెంబర్ 11న జారీ చేసింది. దీనికి అనుగుణంగా వేగవంతమైన, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, ప్రధాన నిందితులతో సహా దాడికి పాల్పడిన వారిని గుర్తించి విచారణ జరపాలని కోరారు. ఘటనకు ముందు ఆరు గంటలు, తర్వాత రెండు గంటల వరకు నిందితుల కాల్ డిటెయిల్స్, టవర్ లొకేషన్లను సేకరించి పరిశీలించడం ద్వారా కుట్ర, సమన్వయం, పాత్రలపై స్పష్టతొస్తుందని ప్రసన్న పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, బుచ్చిరెడ్డిపాళెం మండల కన్వీనర్ సతీష్‌రెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.


