ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
● తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యం
● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
● ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు వినియోగించుకోవాలని సూచన
నెల్లూరు(క్రైమ్): సంక్రాంతి నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశారు. పండగకు చాలామంది ఊర్లకు పయనమయ్యారు. ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా దుండగులు రెక్కీ వేసి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండగ సంతోషంగా ముగించుకుని తీపి జ్ఞాపకాలతో తిరిగి రావొచ్చు. అప్రమత్తంగా లేకపోతే చేదు అనుభవం తప్పదు. ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సేవలను వినియోగించుకుంటే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవచ్చు.
ఇలా చేస్తే..
మారుతున్న కాలంతోపాటు చోరులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పలు కేసుల ఛేదన కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊర్లకు వెళ్లే విషయాలను సోషల్ మీడియాలో పంచుకోరాదు. ఇంటిని గమనిస్తూ ఉండాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి. ఇంటి తలుపులకు సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం అమర్చుకోవాలి. ఎవరైనా తలుపు తీయాలని ప్రయత్నిస్తే ఫోన్‌కు సమాచారం అందుతుంది. ఇంటి లోపల, బయట కొన్నిలైట్లు వేసి ఉంచాలి. సాంకేతికతో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. బంగారు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపరచుకోవాలి. బీరువా, లాకర్ల తాళాలను ఇంట్లో ఉంచరాదు. వెంట తీసుకెళ్లాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే నిలపాలి. ద్విచక్ర వాహనాలకు వీల్‌లాక్‌లను వేయాలి. అపార్ట్‌మెంట్‌ల్లో నివాసం ఉండేవారు నమ్మకమైన వాచ్‌మెన్లను, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి. ఇళ్లముందు దినపత్రికలు, పాలప్యాకెట్లు, చెత్తాచెదారాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. పనిమనిషి ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ఊర్లకు వెళ్లే సమయంలో తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలి. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్థానిక కుటుంబాలు స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి.
అప్రమత్తత తప్పనిసరి
బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. ఎక్కువ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తీసుకెళ్లినా ఎక్కడ పడితే అక్కడ వదిలేయరాదు. సెల్‌ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలి. పండగ వేళ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసి ఉంటాయి. వాటిని ఎక్కే సమయంలో జేబు దొంగతనాలు, బ్యాగ్‌ల కత్తిరింపు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.
పూర్తి ఉచితం
తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు పూర్తి ఉచితం. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను పొందుపరచాలి. ఊర్లకు వెళ్లే సమయంలో యాప్‌లోకి వెళ్లి రిక్వెస్ట్ పోలీస్ వాచ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఎప్పుడు వెళ్లేది, సమయం, తిరిగొచ్చే తేదీ టైప్‌చేసి సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి. పోలీసులు ఇంటికొచ్చి ఇంట్లో మోషన్ కెమెరాలను బిగించి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించారంటే కమాండ్ కెమెరా ఆన్ అవుతుంది. కంట్రోల్ రూమ్‌లో అలారం మోగుతుంది. ఆ ప్రాంత బ్లూకోట్ పోలీసుల నుంచి అందరూ అప్రమత్తమవుతారు. నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని దొంగను పట్టుకునే అవకాశం ఉంది.
ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త


