పొలానికి వెళ్లొస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
కోవూరు: గుర్తుతెలియని వాహనం అతివేగంగా బైక్‌ను ఢీకొనడంతో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం గండవరం గ్రామానికి చెందిన మోపర్తి వెంకటేశ్వర్లు (62) ప్రస్తుతం నెల్లూరులోని వీవర్స్ కాలనీలో నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం తన స్వగ్రామమైన గండవరంలోని పొలాలను చూసేందుకు మోటార్‌బైక్‌పై వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి నెల్లూరుకు వెళ్తుండగా కోవూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు జాతీయ రహదారిపై ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


