పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థలో పనిచేసే విద్యుత్ మీటర్ రీడర్లు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిలానీబాషా, శంకర్ కిషోర్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సంతపేటలో సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా విద్యుత్ మీటర్ రీడర్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన నేతలు మాట్లాడుతూ నేడు ప్రభుత్వ, విద్యుత్ యాజమాన్యం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో 20 సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తున్న రీడర్లకు ఉద్యోగభద్రత లేదన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి సీఎండీ కార్యాలయం వద్ద చేపట్టే నిరాహారదీక్షలు, 22వ తేదీన చలో తిరుపతి కార్యక్రమానికి జిల్లాలోని మీటర్ రీడర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, మీటర్ రీడర్ల యూనియన్ నాయకులు హజరత్‌వలీ, కృష్ణ, బాలకృష్ణ, ఫిరోజ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


