సెమీ ఓపెన్ జైలు నుంచి ఖైదీ పరార్
నెల్లూరు(క్రైమ్): చెముడుగుంటలోని సెమీ ఓపెన్ జైలు నుంచి ఖైదీ పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు భార్య హత్య కేసులో నిందితుడు. ఇతనికి కోర్టు 2022లో జీవితఖైదు విధించింది. రెండేళ్ల పాటు ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారు. 2024 చివరలో జైలు ఉన్నతాధికారులు ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి మార్చారు. ఆరు నెలలుగా చిన్నసైదులు సెమీ ఓపెన్ జైలులో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం తోటి ఖైదీలతో కలిసి సెమీ ఓపెన్ జైలులో పనులకు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన పరారయ్యారు. సాయంత్రం జైలు సిబ్బంది ఖైదీలను లెక్కించే క్రమంలో చిన్నసైదులు కనిపించకపోవడంతో వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
14, 15న నిమ్మ యార్డుకు సెలవు
పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డుకు సంక్రాంతి సందర్భంగా వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నట్టు అసోసియేషన్ కోశాధికారి మెంతెం బాలకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. 15వ తేదీ గురువారం సంక్రాంతి సందర్భంగా సెలవు ప్రకటించామని, ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు అయినందున రెండు రోజులు మార్కెట్ ఉండదన్నారు. రైతులు గురువారం కాయలు కోసి శుక్రవారం మార్కెట్‌కు తీసుకు రావాల్సిందిగా సూచించారు.
13న డైట్ కళాశాలలో స్క్రాప్ వేలం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని డైట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పాత (స్క్రాప్) ఇనుప సామగ్రిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 13న బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి, ఇన్‌చార్జి డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల స్క్రాప్ వ్యాపారులు, వేలం దారులు డైట్ కళాశాలలో జరిగే వేలానికి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 94404 58428 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,678 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,173 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు మూడు గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
లిఫ్ట్ ఇస్తానని నగదు దోపిడీ
నెల్లూరు(క్రైమ్): లిఫ్ట్ ఇస్తానని ఓ వృద్ధుడిని బైక్ ఎక్కించుకుని దారి మళ్లించి బ్యాగ్‌లోని నగదును గుర్తుతెలియని దుండగుడు దోచుకెళ్లిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఓ వృద్ధుడు కొత్తూరు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో దారి మళ్లించి నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ వీధిలోని ఓ స్కూల్ సమీపంలోకి తీసుకెళ్లి వృద్ధుడి బ్యాగ్‌లోని నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధితుడు కుటుంబసభ్యులకు తెలియజేసి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


