భూ ఆక్రమణకు యత్నం
మర్రిపాడు: టీడీపీ అధికారంలోకి వచ్చాక విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి. మెట్ట మండలమైన మర్రిపాడులో అత్యధిక ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీంతో కూటమి నాయకులు ప్రతి నిత్యం ఏదో ఒక గ్రామంలో భూ ఆక్రమణలకు బరితెగిస్తూనే ఉన్నారు. మండలంలోని చాబోలు గ్రామంలో మేడిబోయిన వెంకటాద్రి అనే వ్యక్తి సర్వే నంబర్ 388, 391లలో జేసీబీతో శనివారం భూ ఆక్రమణకు ప్రయత్నించాడు. దీంతో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది భూ ఆక్రమణను అడ్డుకున్నారు. గతంలోనే వెంకటాద్రి గ్రామ సర్వే నంబర్ 400, 403లలో ఎస్టీల సాగులో ఉన్న పది ఎకరాల భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేపట్టినట్లు స్థానిక ఎస్టీలు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎస్టీలు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బందికి తాము సమాచారం ఇచ్చి వారు వచ్చి పదే పదే హెచ్చరిస్తున్నా బరితెగింపుగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని, దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని విన్నవిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ అనిల్‌కుమార్ యాదవ్‌ను వివరణ కోరగా గ్రామస్తుల సమాచారం ఇచ్చిన వెంటనే ఆక్రమణలను నిలిపివేశామని, మండలంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు.


