వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం
సోమశిల: రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తోందని, వారు చేసే తప్పులను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలను అడ్డుకోవడం దారుణమని.. పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. సోమశిల జలాశయాన్ని శనివారం సందర్శించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ శ్రేణులు, అభిమానులు, రైతులు సోమశిలకు బయల్దేరగా, మార్గమధ్యలో ఉప్పలపాడు జాతీయ రహదారి జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ బిజ్జివేముల పిచ్చిరెడ్డి మాట్లాడారు. కాకాణితో పాటు పలువుర్ని నిర్బంధించడాన్ని ఖండించారు. అనంతరం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సంగం మండల మాజీ కన్వీనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.


