ఉద్యమంపై ఖాకీల ఉక్కుపాదం
20 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గాంధీబొమ్మ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం, వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన 20 మందిని చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఊటుకూరు నాగార్జున, ఆశ్రిత్‌రెడ్డి, తౌఫిక్, వంశీ, దిలీప్, నానీ, యస్దానీ, సునీల్, ప్రవీణ్, విష్ణువర్ధన్ తదితరులున్నారు.
నెల్లూరు రూరల్: గత ఎన్నికలకు ముందు విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలతో పాటు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు మేరకు పలువురు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నగరంలోని గాంధీబొమ్మ వద్ద శాంతియుతంగా నిరసనను శుక్రవారం చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగ నేతలు తమ చేతులకు సంకెళ్లేసుకొని సర్కార్ వైఖరిని ఎండగట్టారు. రోడ్డుపై ఓ పక్కన బైఠాయించారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నా, అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఉద్యమంపై ఖాకీలు ఉక్కుపాదం మోపారు. చిన్నబజార్ పోలీసులొచ్చి ఆందోళనను ఆపాలంటూ హుకుం జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిరసన తెలుపుతున్నామని వారు చెప్పినా, తమ మార్కును ప్రదర్శించారు. తామెలాంటి తప్పూ చేయలేదని, రాజ్యాంగ పరిధిలోనే నిరసన చేపట్టామని తెలిపినా, వినకుండా నిరంకుశంగా అరెస్ట్ చేసేందుకు యత్నించారు. దీంతో వారు ప్రతిఘటించారు. ఓ దశలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు నేతలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనంలో పడేసి చిన్నబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆపై అక్రమ కేసులను నమోదు చేశారు.
హామీలను అమలు చేసేంత వరకు పోరుబాట
నిరసనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్‌ను ఏటా జనవరి ఒకటిన విడుదల చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని వారు చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చి 19 నెలలైనా, దీన్ని ప్రకటించకుండా, మోసం చేశారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఉపకార వేతనాలనూ సకాలంలో విడుదల చేయడంలేదని విమర్శించారు. ప్రైవేట్‌ను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత మంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనాన్ని ఇస్తామని నమ్మబలికిన సర్కార్ అనేక మందికి కోత విధించిందని దుయ్యబట్టారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు జాబ్ వచ్చేంత వరకు నిరుద్యోగులకు రూ.మూడు వేల చొప్పున భృతిని ఇస్తామని చెప్పి, ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విద్య, వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి, పేదలను ఆదుకున్నారని గుర్తుచేశారు.
అబద్ధాల ప్రభుత్వం
రాష్ట్రంలో అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మున్నా, పీడీఎస్‌యూ జిల్లా నేత సునీల్ ఆరోపించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో తన పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు.
గాంధీబొమ్మ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన
వైఎస్సార్సీపీ నేతలను లాక్కెళ్తున్న పోలీసులు
సంకెళ్లేసుకొని నిరసన తెలుపుతూ..
సంకెళ్లతో వైఎస్సార్సీపీ విద్యార్థి,
యువజన విభాగ నేతల ఆందోళన
జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్
హామీలు అమలు చేయాలంటే అరెస్టులా..?
పోలీసులతో వాగ్వాదం, తోపులాట
ఉద్రిక్త వాతావరణం
ఉద్యమంపై ఖాకీల ఉక్కుపాదం
ఉద్యమంపై ఖాకీల ఉక్కుపాదం


