న్యాయవాదుల నిరసన
నెల్లూరు (లీగల్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధులను న్యాయవాదులు నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యపరెడ్డి మాట్లాడారు. న్యాయమిత్ర పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు రూ.పది వేల స్టయ్‌పండ్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ నిధులతో హెల్త్ ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. గతేడాది జూలైలో హైకోర్టు జారీ చేసిన సర్కులర్‌ను ఉపసంహరించాలని పేర్కొన్నారు.
ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
వెంకటాచలం(పొదలకూరు): యువత ఉద్యోగాల కోసమే కాకుండా ఉపాధిని కల్పించే స్థాయికి ఎదగాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వర్సిటీలో ఐదు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్ శుక్రవారంతో ముగిసింది. సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. యు వత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాంక్షించారు. స్టార్టప్‌లపై సమగ్ర అవగాహనను కల్పించామని వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
టెట్ ఫలితాల విడుదల
నెల్లూరు (టౌన్): టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ పది నుంచి 21 వరకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10,640 మంది రిజిస్టర్ చేసుకోగా, 9928 మంది హాజరయ్యారు. 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
విద్యాసంస్థలకు నేటి
నుంచి సంక్రాంతి సెలవులు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈ నెల 18 వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు పాఠశాలలపై చర్యలు చేపడతామని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు.
పోర్టుకు ఐసీసీ
పర్యావరణ అవార్డు
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చాంపియన్ – ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ భాగస్వామ్య సదస్సులో అవార్డును అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న వారిని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ అభినందించారు.
న్యాయవాదుల నిరసన
న్యాయవాదుల నిరసన


