శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● హోం మంత్రి అనిత
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చెముడుగుంటలోని కేంద్ర కారాగారాన్ని ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. కారాగారంలో పరిశ్రమల విభాగం, ఖైదీల బ్యారక్, వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులను ఆరాతీశారు. అనంతరం పోలీస్ అతిథిగృహానికి చేరుకున్న ఆమె పలు అంశాలపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఖైదీల జీవన విధాన మార్పునకు జైలు అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. స్వయంగా పేస్టులు, షాంపులు, నూనె, బీరువాలను తయారు చేస్తూ నెలకు రూ.ఏడు వేల నుంచి రూ.ఎనిమిది వేలను సంపాదించుకుంటున్నారని వివరించారు. జైలు, అగ్నిమాపక శాఖల్లో కొంతకాలంగా ఎలాంటి నియామకాలు జరగని కారణంగా ఖాళీలున్నాయన్నారు. జాబ్ క్యాలెండర్‌ను త్వరలో విడుదల చేసి నియామకాలు చేపడుతామని చెప్పారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను ఏటా చేపడతామని వెల్లడించారు. ఎస్పీ అజిత పనితీరును అభినందించారు. ఏఎస్పీ సౌజన్య, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


