చిరుధాన్యాలను సాగు చేయాలి
పొదలకూరు: పంటల మార్పిడిలో భాగంగా చిరుధాన్యల సాగును రైతులు అధికంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి సూచించారు. స్థానిక చిరుధాన్య పరిశోధన స్థానంలో ఐదు మండలాల రైతులు శుక్రవారం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల మేళాకు హాజరైన ఆమె మాట్లాడారు. వరినే సంప్రదాయ పద్ధతిలో పండిస్తున్నారని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయమొచ్చే చిరుధాన్యాలనూ సాగు చేయాలని సూచించారు. నెల్లూరు, పొదలకూరు ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు, ప్రసన్న రాజేష్, ప్రకృతి వ్యవసాయ డీపీఎం వెంకురెడ్డి, పొదలకూరు, నెల్లూరు ఏడీఏలు శివనాయక్, నర్సోజీ పాల్గొన్నారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
నెల్లూరు(పొగతోట): యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం – 1985 మేరకు కఠిన చర్యలను చేపడతామని చెప్పారు. ప్రైవేట్ డీలర్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్‌ఎస్కేలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ గోదాముల్లో 15,795 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు.


