టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
● నుజ్జునుజ్జయిన కుడిచేయి
● వాహనాన్ని వదిలేసిన పోలీసులు
వింజమూరు(ఉదయగిరి): టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి కుడిచేయి కోల్పోయిన ఘటన శుక్రవారం వింజమూరు మండలం బత్తినవారిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొండాపురం మండలం యర్రబొట్లపల్లి వద్ద ఉన్న ఓ క్వారీ నుంచి తెల్లరాయి లోడుతో వింజమూరు వైపు టిప్పర్ వెళ్తోంది. అదే సమయంలో వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన కంచుపాటి ఆనంద్ మోటార్‌బైక్‌పై వింజమూరుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బత్తినవారిపల్లి సమీపంలో బైక్ వెళ్లేందుకు టిప్పర్ డ్రైవర్ సైడ్ ఇచ్చాడు. అయితే ఒక్కసారిగా మళ్లీ రోడ్డుపైకి వచ్చాడు. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. టిప్పర్ వెనుక టైరు ఆనంద్ కుడిచేయిపై ఎక్కడంతో నుజ్జునుజ్జయింది. ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యు లు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోకుండా వదిలేయడంపై రాజకీయ ఒత్తిళ్లున్నట్లు ప్రచా రం జరుగుతోంది. క్షత్రగాత్రుడు నిరుపేద. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయమై ఎస్సై వీరప్రతాప్‌ను సంప్రదించగా వైద్యశాల నుంచి సమాచారం రాలేదని, వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని తెలిపారు. వాహనం వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు.


