పాపం అయ్యోర్లు
● పేరుకే బదిలీ
● పాత స్థానాల్లో విధులు
● నెలలుగా తిప్పలు పడుతున్న వైనం
● టీడీపీ ప్రభుత్వంపై గుర్రుగా టీచర్లు
ఉదయగిరి: వైఎస్సార్‌సీపీ పాలనలో అమలు చేసిన నూతన విద్యావిధానంపై టీడీపీ విష ప్రచారం చేసింది. దీనిని నమ్మిన ఉపాధ్యాయ లోకం కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతోందని భావించింది. అయితే నేడు జరుగుతోంది వేరు. సమస్యలకు పరిష్కారం లభించలేదు. ప్రస్తుత ప్రభుత్వ విద్యావిధానాలు టీచర్లకు తలనొప్పిగా మారాయి.
జిల్లా వ్యాప్తంగా గత వేసవిలో జరిగిన బదిలీల్లో కొంతమంది టీచర్లు తాము కోరుకున్న స్థానాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. మరో 259 మంది కౌన్సెలింగ్‌లో కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. అయితే వారు అక్కడికి వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము పనిచేసే (పాతవి) స్థానాలను కొత్తగా టీచర్లెవరూ కోరుకోలేదు. దీంతో బదిలీ జరిగినా రిలీవర్ రాలేదనే సాకుతో అక్కడే ఉంచారు. కొన్నేళ్లుగా సుదూర ప్రాంతాల్లో పనిచేసి అలసిపోయి, తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యామనే సంతోషం వారికి ఎక్కువ కాలం మిగల్లేదు.
గత వేసవిలోనే బదిలీలు
పాఠశాలల పునఃప్రారంభం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం సంబంధిత ప్రక్రియను నిర్వహించింది. ఈ క్రమంలో ముందుగా ఖాళీల్లో మెగా డీఎస్సీలో ఎంపికై న వారిని భర్తీ చేసింది. ఆపై మిగిలిన టీచర్లకు బదిలీలు జరిగాయి. వీరిలో కొంతమందికి నిరాశే మిగిలింది. ఒకేచోట 8 సంవత్సరాలు పనిచేసిన వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కానీ వేరేవారు ఆ స్థానాలను కోరుకోకపోవడంతో బదిలీ చేయలేదు. సాంకేతికంగా బదిలీ అయినా భౌతికంగా తాము పనిచేస్తున్న పాత బడుల్లోనే ఉండాల్సి వచ్చింది. చాలామంది టీచర్లు బదిలీ జరిగిన ప్రాంతాలు, సమీపంలో కుటుంబాలను ఏర్పాటు చేశారు. అయితే పాతచోటే పని చేయాల్సి రావడంతో వ్యయప్రయాసలతో సతమతమతున్నారు.
పని ఒకచోట.. జీతం మరోచోట
బదిలీ అయిన ఉపాధ్యాయుల పని ఒకచోట.. రికార్డుల్లో పేరు మరోచోట ఉంది. జీతం అక్కడి నుంచే తీసుకోవాల్సి ఉంది. సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న చోటుకు బదిలీ అయిన వెంటనే జాయిన్ అయ్యారు. కానీ పాఠశాలల పునఃప్రారంభం అయిన తర్వాత కొత్త టీచర్ వచ్చే వరకు పాత బడుల్లోనే పని చేయాలని అధికారులు వెనక్కి పంపారు. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై గుర్రుగా ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వం న్యాయం చేయాలి
ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, టీచర్లు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఇప్పటికే వారు కుటుంబాలను బదిలీ ప్రాంతాలకు మార్చుకున్నారు. అక్కడి నుంచి రోజూ దూర ప్రయాణం చేయడం కష్టంగా మారింది. ఏడు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి.
– సురేంద్రరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పాపం అయ్యోర్లు


