నగదు కోసమే వృద్ధురాలి హత్య | - | Sakshi
Sakshi News home page

నగదు కోసమే వృద్ధురాలి హత్య

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

నగదు కోసమే వృద్ధురాలి హత్య

నగదు కోసమే వృద్ధురాలి హత్య

బెట్టింగుల్లో అప్పులపాలైన యువకుడు

మరో మహిళ హత్య కేసు

వెలుగులోకి..

నిందితుడి అరెస్ట్‌

30 గ్రాముల బంగారు సరుడు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): అతను కారు డ్రైవర్‌. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లాడుతూ అప్పులపాలయ్యాడు. తన అవసరాలకు సరిపడా నగదు కోసం ఇంటికి ఎదురుగా నివాసముంటున్న ఒంటరి వృద్ధురాలిని హత్య చేసి ఆమె మెడలోని 30 గ్రాముల సరుడును దోచుకెళ్లాడు. మృతురాలి శరీరంలో చిక్కుకున్న గోరు ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. విచారణలో మూడేళ్ల క్రితం చేసిన మరో మహిళ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ అజిత వేజెండ్ల కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో పేట కోటేశ్వరమ్మ (68) ఒంటరిగా నివాసముంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉంటున్నాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కోటేశ్వరమ్మను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఆమె మెడలోని బంగారు సరుడును దోచుకెళ్లారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కొడవలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక సీఐ ఎ.సురేంద్రబాబు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కోటేశ్వరమ్మ శరీరంపై లభ్యమైన గోరు ఆధారంగా నిందితుడు ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న కారు డ్రైవర్‌ వేముల రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. గురువారం నిందితుడు నార్తురాజుపాళెంలో రోడ్డు వద్ద నిలబడి ఉండగా సీఐ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించారు.

అప్పులపాలై..

రంజిత్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జల్సాలతో అప్పులపాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో ఎలాగైనా నగదు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కోటేశ్వరమ్మ ఒంటరిగా, ఒంటిపై బంగారు ఆభరణాలతో ఉండటాన్ని గమనించాడు. ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకుంటే తన అవసరాలు తీరుతాయని భావించాడు. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కోటేశ్వరమ్మ ఇంటికెళ్లాడు. వరండాలో నిద్రిస్తుండగా తన వెంట తెచ్చుకున్న రాయితో ఆమెను హతమార్చాడు. ఆమె మెడలోని 30 గ్రాముల సరుడును దోచుకెళ్లానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీంతో అరెస్ట్‌ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

మరో మహిళ హత్య కేసు

పోలీసులు నిందితుడిని విచారించే క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 2022 జూన్‌ 2వ తేదీన కొత్త వంగల్లు గ్రామంలో గోలి సుశీలమ్మ మృతిచెందారు. ఆ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ విషయం మరుగున పడిపోయింది. రంజిత్‌ కుమార్‌, ఓ మహిళ (సుశీలమ్మ సమీప బంధువు)తో కలిసి సుశీలమ్మను హత్య చేసినట్లు తాజా విచారణల్లో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

సిబ్బందికి అభినందన

వృద్ధురాలి హత్య కేసును ఛేదించేందుకు కృషిచేసిన రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, కొడవలూరు, కోవూరు, కృష్ణపట్నం పోర్టు సీఐలు ఎ.సురేంద్రబాబు, వి.సుధాకర్‌రెడ్డి, రవినాయక్‌, వెంకటాచలం, సీసీఎస్‌, మహిళా పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌లు పి.సుబ్బారావు, సీహెచ్‌ సీతారామయ్య, టీవీ సుబ్బారావు, సిబ్బంది తదితరులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement