ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్‌కు అనుమతులు
● జేసీ వెంకటేశ్వర్లు
సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని గూడూరు మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల రెవెన్యూ పరిఽధిలోని సర్వే 793లో 10.305 హెక్టార్లులో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణం అనుమతి కోసం ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మైనింగ్ కావాలంటూ తద్వారా తమ జీవనోపాధికి ఉపాధి కలుగుతుందని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పలువురు అధికారులకు విన్నవించారు. మరికొందరు మైనింగ్ వద్దన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంట్ అధికారి అశోక్ కుమార్, గని యజమాని ఉదయ్‌భాస్కర్, తహసీల్దార్ సుభద్ర, ఆర్‌ఐ ప్రదీప్‌కుమార్, పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలులో దొంగల బీభత్సం
● రెండుచోట్ల చోరీలు
మనుబోలు: మండల కేంద్రంలోని బీసీ కాల నీ, వైఎస్సార్ సర్కిల్ వద్ద బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. బీసీ కాలనీలో నివాసముంటున్న కొమరాల శ్రీ కాంత్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి నెల్లూరులోని అత్తారింటికి వెళ్లాడు. గురువారం ఉదయం పక్కింటి వాళ్లు ఫోన్ చేసి మీ ఇంటి తాళం తీసుందని చెప్పడంతో వెంటనే వచ్చాడు. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు, రూ.50 వేల నగదు దోచుకున్నారు. అలాగే వైఎస్సార్ సర్కిల్ వద్ద కావేటి పెంచలయ్య అనే వ్యక్తికి చెందిన దుస్తుల షాపు గోదాము తాళాలు పగులగొట్టి కిటికి గ్రిల్స్ తీసివేసి లోపలికి ప్రవేశించారు. రూ.3 లక్షల విలువ చేసే దుస్తులు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.


