ఎల్‌ఐసీలో పెట్టుబడులు సురక్షితం
నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీలో ప్రజలు చెల్లించే ప్రీమియంలు 100 శాతం సురక్షితంగా ఉంటాయని ఎల్‌ఐసీ ఏఓఐ రాష్ట్ర ట్రెజరర్ బెజవాడ శివయ్య తెలిపారు. గురువారం నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జిల్లా ఏఓఐ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బీమా సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నందువల్ల అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జాతీయం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీని స్థాపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సావరిన్ గ్యారంటీ కల్పించి అందుకు అనుగుణంగా చట్టం చేసిందన్నారు. అయితే నేటి కేంద్ర ప్రభుత్వం మళ్లీ 100 శాతం ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఎల్‌ఐసీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై కూడా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ సీహెచ్ నరసింహారావు, రాష్ట్ర నాయకులు మేకల నరసింహారావు యాదవ్, హజరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


