మెడికవర్‌లో కిడ్నీ మార్పిడి
● బిడ్డకు దానం చేసిన తల్లి
నెల్లూరు(అర్బన్): బిడ్డకు తల్లి కిడ్నీ దానం చేయడంతో డాక్టర్ల బృందంతో కలిసి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించామని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంవీ సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. సూళ్లూరుపేటకు చెందిన 34 ఏళ్ల పొంకం శ్రీనివాసులు కిడ్నీ ఫెయిలైంది. నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సమస్య తీవ్రం కావడంతో శ్రీనివాసులు ఆస్పత్రికి వచ్చాడన్నారు. 58 ఏళ్ల వయసున్న రోగి తల్లి విజయమ్మ కిడ్నీ ఇచ్చేందుకు మందుకొచ్చారన్నారు. గత నెల 11న ఆపరేషన్ చేసి కిడ్నీ తీసి బిడ్డకు అమర్చామన్నారు. లాపరోస్కోపిక్ విధానంలో సర్జరీ వల్ల ఆమె రెండురోజులకే నడవగలిగిందన్నారు. శ్రీనివాసులు పూర్తిగా కోలుకున్నాడన్నారు. మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి ఆపరేషన్‌ను ఇప్పుడు నెల్లూరులో విజయవంతంగా చేశామన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్ నచికేత్, మత్తు డాక్టర్ రంగనాథ్, సీసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ గౌతమ్, క్లస్టర్ హెడ్ రంజిత్‌రెడ్డి, సెంటర్ హెడ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.


