గూడూరులో కార్డన్ సెర్చ్
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో గురువారం వేకువజాము నుంచి మూడుగంటలపాటు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 600 ఇళ్లలో తనిఖీలు చేశారు. అద్దె ఇళ్లలోని వారి ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుంచి వచ్చారు?, ఎక్కడ పని చేస్తున్నారు? తదితర విషయాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ అద్దె ఇళ్లలో నివాసముండేందుకు వచ్చినవారు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తమ బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకుల్లో పెట్టాలన్నారు. అలాగే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలియజేస్తే బీట్‌కు వెళ్లే పోలీసులు ఇంటిపై నిఘా ఉంచుతారన్నారు. సరైన ధ్రువీకరణపత్రాల్లేని 14 ద్విచక్ర వాహనాలకు సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఒకటి, రెండో పట్టణ, రూరల్ సీఐలు శేఖర్‌బాబు, శ్రీనివాసులు, కిశోర్‌బాబు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


