పిడతాపోలూరులో డీజిల్ మాఫియా
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని ఏపీ జెన్కో రోడ్డులో అక్రమంగా డీజల్ అమ్మకాలు సాగిస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించారు. జిల్లా కు చెందిన ఓ కంపెనీ నిర్వాహకులు అక్రమంగా ఇక్కడ డీజిల్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికుల ఫిర్యాదుతో అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బంకుల్లో ఎలాగైతే అమ్మకాలు సాగిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసుకు ని బూడిద లారీలకు డీజిల్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్ మాఫియా పెద్ద ఎత్తున రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తూ ప్రమాదాలకు సైతం కారణం అవుతున్నట్టుగా తెలిసింది. సివిల్ సప్లయ్స్ అధికారులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ డీజిల్ వ్యాపారాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. అక్రమంగా డీజిల్ అమ్మకాల వల్ల స్థానికంగా ఉండే పెట్రోల్ బంకుల యజమానాలు నష్టపోతున్నారు. ఈ మేరకు అధికారులు డీజిల్ లారీలను సీజ్ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు అందజేస్తామని వెల్లడించారు.
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లోంచి పడి ఓ వ్యక్తి మరణించిన ఘటన మండల పరిధిలోని మనుబోలు, గూడూరు రైల్వేస్టేషన్‌ల మధ్య బుధవారం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ 142/13–11 కిలోమీటర్ వద్ద అప్‌లైన్‌లో ప్రమాదవశాత్తూ జరిపడి మరణించాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు చొక్కా, దానిపై బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ జర్కిన్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై హరిచందన మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నిరాహార దీక్ష
● సమస్యల పరిష్కారానికి డిమాండ్
నెల్లూరు(దర్గామిట్ట): నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బుధవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.చంద్రమౌళి మాట్లాడుతూ ఈపీఎస్ 95 స్కీమ్ ద్వారా విశ్రాంత ఉద్యోగులకు రూ.9000 వరకు పెన్షన్ పెంచి అందించాలన్నారు. ఈహెచ్‌ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీలోని అన్ని బస్సుల్లో విశ్రాంత ఉద్యోగితో పాటు అతని భార్యకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని దీక్షను చేపట్టినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు జి.శంకరయ్య, అధ్యక్షుడు చంద్రమౌళి, కోశాధికారి మురళి పాల్గొన్నారు.
పిడతాపోలూరులో డీజిల్ మాఫియా
పిడతాపోలూరులో డీజిల్ మాఫియా


