సహజీవనం చేస్తున్నాడనే అక్కసుతో..
● పథకం ప్రకారమే శివ హత్య
నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలు రాలేదన్న అక్కసుతో ఆమెతో సహజీవనం చేస్తున్న శివను నిందితులు హతమార్చారు. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన జ్యోతికి కోటకు చెందిన లీలామోహన్‌తో 2018లో వివాహమైంది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. మనస్పర్థల నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింటిలో ఉంటోంది. ఏడాది కిందట ఒంటిమిట్టకు చెందిన సాయితో ఆమెకు పరిచయమైంది. ఎనిమిది నెలలు వారు ఒంటిమిట్టలో సహజీవనం చేశారు. సాయితో మనస్పర్థలు రావడంతో ఆమె అతనికి దూరంగా ఉంటూ మూడు నెలల కిందట నెల్లూరుకు వచ్చింది. ఇక్కడ భిక్షాటన, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద ఉంటోంది. కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపుర్ జిల్లా, రత్నతాటి గ్రామానికి చెందిన చిన్ననరసింహ అలియాస్ శివ (30) సైతం పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వారి మధ్య పరిచయమైంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన అశోక్ నెల్లూరు నగరంలో పనులు చేసుకుంటూ రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్నారు. అశోక్ తనతో రమ్మని జ్యోతిని కోరగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే పది రోజుల కిందట సాయి నెల్లూరుకు వచ్చారు. తన స్నేహితురాలు శివతో సహజీవనం చేస్తుందని తెలుసుకుని రగిలిపోయాడు. అతన్ను విడిచి రమ్మని కోరగా ఆమె నిరాకరించడంతో శివను చంపైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే సాయి, అశోక్ ఒక్కటై శివను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి వారు ఫూటుగా మద్యం తాగారు. రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో శివ, జ్యోతి కూర్చొని ఉండగా తమ వద్దనున్న కర్రతో వారు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇందులో శివ మృతిచెందగా, జ్యోతికి గాయాలయ్యాయి. ఆమె ఫిర్యా దు మేరకు సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య నిందితులపై హత్యకేసు నమోదు చేశారు. సాయి పాత నేరస్తుడని ఆయనపై నెల్లూరు, కడప జిల్లాలో దొంగతనం కేసులున్నాయని తెలిసింది.


