తప్పు చేసిన అధికారులు విచారణ ఎదుర్కోవాలి
● సర్పంచ్‌ల చెక్ పవర్‌ను
అన్యాయంగా రద్దు చేశారు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం(పొదలకూరు): అధికార పార్టీకి తొత్తుల్లా మారి తప్పులు చేస్తున్న అధికారులు విచారణను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వెంకటాచలం సర్పంచ్‌గా మందల రాజేశ్వరి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెంకటాచలం సర్పంచ్‌పై లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యపై కక్ష సాధింపుల్లో భాగంగా ఆయన సతీమణి రాజేశ్వరిపై అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయించడంతో కాలపరిమితి విధించి తిరిగి విచారణ చేపట్టాలని.. అది దాటితే సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దవుతాయని పేర్కొందని తెలిపారు. ఇది పూర్తి కావడంతో కోర్టు ఆదేశాల మేరకు రాజేశ్వరి తిరిగి సర్పంచ్‌గా బాధ్యతలను స్వీకరించారని తెలిపారు.
సోమిరెడ్డి కక్షసాధింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచ్‌లపై అప్పటి డీపీఓ శ్రీధర్‌రెడ్డిని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు సోమిరెడ్డి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే రాజేశ్వరిపై సస్పెన్షన్‌ను విధించారని చెప్పారు. ఆమెతో పాటు అనేక మంది సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను జిల్లా వ్యాప్తంగా రద్దు చేశారన్నారు. దీనికి నజరానాగా శ్రీధర్‌రెడ్డికి జెడ్పీ సీఈఓ పోస్ట్‌ను ఇప్పించారని విమర్శించారు. తమ పార్టీ సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసిన శ్రీధర్‌రెడ్డి.. వారు టీడీపీ కండువాలు కప్పుకోగానే పునరుద్ధరించారని తెలిపారు. ఆయన లాంటి అవకాశవాద అధికారి మాటలను వినకుండా వాస్తవాలను కలెక్టర్ గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. సోమిరెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల సాయంతో గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారని, లేనిపక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ పనుల్లో భారీగా అవినీతి
ఇరిగేషన్ పనుల్లో రూ.100 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని, ఆయనతో అంటకాగిన అధికారులు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయ మేనేజర్ గంగాధర్‌రెడ్డిపై విచారణకు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ ఆదేశించారని, దీనికి హాజరవుతున్న కాంట్రాక్టర్లను సాక్ష్యం చెప్పొద్దంటూ ఫోన్లు చేసి సోమిరెడ్డి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. గంగాధర్‌రెడ్డి ఫోన్‌పేతో పాటు ఆయన కుమారుడు, సమీప బంధువుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరును ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, వైస్ ఎంపీపీలు కోదండరామిరెడ్డి, మస్తానయ్య, పార్టీ మండల కన్వీనర్ మోహన్‌నాయుడు, డేగా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


