స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన హామీల మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్‌షరీఫ్, వైఎస్సార్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంజయ్ బుధవారం మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా, నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. యోగాంధ్ర, ఆవకాయ్ అమరావతి లాంటి ఈవెంట్లకు భారీగా వెచ్చిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిధుల్లేవని చెప్పడం సిగ్గుచేటని చెప్పారు. విమానాల్లో ప్రయాణానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వేల కోట్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులున్నారనే విషయం తేలిందన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరిన విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులను బనాయించడంతో పాటు పాత కేసులను బయటకు తీసి అణిచేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనను యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన చేపట్టనున్నామని వెల్లడించారు. నేతలు మున్నా, సుధీర్, వంశీ, రాజా, శివమ్, వర్మ, గౌస్‌బాషా, మధుసూదన్‌రెడ్డి, సుజిత్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


