జిల్లా రెడ్‌క్రాస్ సేవలకు రాష్ట్రంలో గుర్తింపు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): పలు ప్రాజెక్టులతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సేవలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల రెడ్‌క్రాస్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రారంభించారు. తలసేమియాతో బాధపడుతూ రక్తమెక్కించుకుంటున్న చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వాడవాడలా రెడ్‌క్రాస్ సేవలు అనే వాహనాన్ని ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ దాత, రెడ్‌క్రాస్ కేన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ కలికి శ్రీహరిరెడ్డిని అభినందించారు. రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆద్యులైన జోలి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. 13 రకాల ప్రాజెక్టులను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వీటి ద్వారా సేవలందిస్తున్న జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్‌రెడ్డిని అభినందించారు. రెడ్‌క్రాస్ సేవలకు తాను అండగా ఉంటానన్నారు.
రక్తదాన మోటివేటర్లకు అవార్డులు
జిల్లాలో 135 మంది రక్తదాన మోటివేటర్లకు జ్ఞాపికలు, ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు. నేస్తం ఫౌండేషన్ నుంచి కోరెం ప్రవీణ్‌కుమార్, హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి కుంచాల వినయ్, తబిత తదితరులు అవార్డులను అందుకున్నారు. బ్లడ్ బ్యాంక్ కో ఆర్డినేటర్ బయ్యా ప్రసాద్, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్‌రాజు, కోశాఽధికారి సురేష్‌కుమార్ జైన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవిప్రకాష్, కలికి శ్రీహరిరెడ్డి, యడవల్లి సురేష్, గునపాటి ప్రసాద్‌రెడ్డి, రంగయ్యనాయుడు, దాసరి రాజేంద్రప్రసాద్, రెడ్‌క్రాస్ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.


