అవునండీ.. నగదు బదిలీ వాస్తవమే
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు ఇరిగేషన్ శాఖలో చోటుచేసుకున్న సిత్రాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌పే ద్వారా లంచాలను స్వీకరించారనే అంశంపై సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అయంది వాస్తవమేనంటూ అధికారులకు ఇచ్చిన నివేదికలో కార్యాలయాధికారి పేర్కొనడం గమనార్హం. అయితే అది కాంట్రాక్టల్లిచ్చే పర్సంటేజీ కాదని.. తన కుమారుడు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన సేవలకు మెచ్చి వారు ఇచ్చిన నజరానానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవినీతి వాస్తవమేనని ఆ వివరణ లేఖ ద్వారా తెలుస్తోంది. ఇంత పక్కా ఆధారాలతో అవినీతి వెలుగులోకి వచ్చినా, ఏసీబీ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఇలా జరుగుతోందనే ప్రచారం లేకపోలేదు.
చేయని పనులకూ బిల్లులు
నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి మూడు వర్కులు.. ఆరు పేమెంట్లు అనే చందంగా సాగుతోంది. ప్రతి పనికీ పర్సంటేజీలను వసూలు చేసి బిల్లులివ్వడం.. చేయని వాటికి సైతం మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న సదరు అధికారి నిత్యం తిరుపతి జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తూ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి పనీ తనకు తెలిసే జరపాలంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి బిల్లుకు ఐదు శాతాన్ని సదరు అధికారికే ఇవ్వాలి. ఇక ఏఈ నుంచి ఎస్‌ఈ స్థాయి అధికారికి దాదాపు 15 శాతం మేర సమర్పించాల్సి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మొత్తంలో వసూలు చేస్తుంటే పనిలో నాణ్యత ఎలా ఉంటుందో పెరుమాళ్లకే ఎరుక.
కన్సల్టెంటా..?
తన కుమారుడు కన్సల్టెంట్‌గా పనిచేయడంతోనే నగదు బదిలీ అయిందని సదరు అధికారి వివరణ ఇవ్వడం గమనార్హం. వాస్తవంగా ఇలా ఉండాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరోవైపు సదరు అధికారి తనయుడు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంటారు. అయితే ఆయన ఇక్కడ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని చెప్పడం సదరు అధికారికే చెల్లింది. వాస్తవానికి ఒక పనికి అంచనాలేయాలంటే ప్రైవేట్ కన్సల్టెంట్‌కు అధికారులే ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఈ అవకాశం ఉండదు. ఇలా కన్సల్టెంట్.. అధికారి.. వారి సమీప బంధువుకు ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అవ్వడంతో ఈ ముగ్గురి బ్యాంక్ ఖాతాలను సమగ్రంగా పరిశీలిస్తే ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో తెలుస్తుంది.
మౌనమేలనోయి..?
అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తే వారిని జైలుకు పంపుతామంటూ ఏసీబీ అధికారులు నిరంతరం చెప్తుంటారు. అయితే ఇరిగేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా, స్పందన కొరవడింది. బిల్లుల్లో పర్సంటేజీల కోసం భారీగా నగదు బదిలీ అవుతోందంటూ పక్కా ఆధారాలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని అందరూ ప్రచురించినా, విచారణకు ఏసీబీ అధికారులు ఏ మాత్రం ముందుకురావడంలేదు. వీరిపై రాజకీయ ఒత్తిడి ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత టీడీపీ పాలన లో అవినీతి ఏ స్థాయికి చేరిందనే అంశానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది.
నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి కొత్త పుంతలు తొక్కింది. ముడుపులను యూపీఐ ద్వారా స్వీకరించి సరికొత్త అధ్యయానికి ఇక్కడ తెరలేపారు. ఈ ఉదంతంలో ఆ శాఖ అధికారి చెప్తున్న మాటలు విస్మయం కలిగిస్తున్నాయి. నగదు బదిలీ అయింది వాస్తవమేనని, తన కుమారుడు కన్సల్టెంట్‌గా ఉండటంతో వీటిని జమ చేశారంటూ బుకాయింపు చర్యలకు పాల్పడ్డారు. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే అసలు బాగోతం బయటకొచ్చే అవకాశమున్నా, ఏసీబీ అధికారులు మాత్రం మౌనవ్రతం దాలుస్తున్నారు.
నా కుమారుడు కన్సల్టెంట్‌గా ఉన్నారు
అందుకే కాంట్రాక్టర్లు డబ్బులేశారు
ఇరిగేషన్ అధికారి బుకాయింపు
ఆధారాలున్నా, ఏసీబీ అధికారుల మౌనవ్రతం
బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తే అవినీతి బయటపడే అవకాశం


