తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతో కాలం సాగవు
● పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులు
● సీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ ప్రశ్నించరు
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి రోజా
వెంకటాచలం (పొదలకూరు): అధికారముందనే అహంకారంతో తండ్రీకొడుకులు బరితెగించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలను సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళితో కలిసి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికీ అదే గతి పడుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాల్జేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు చేసుకుంటే, ఆ కేసును పిన్నెల్లి సోదరులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని విమర్శించారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా, అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో పోలీస్ వ్యవస్థ అట్టడుగున ఉందని, దీనికి ఆ శాఖ సిగ్గుపడాలన్నారు.
క్రెడిట్ చోరీ చంద్రబాబుకు అలవాటే
క్రెడిట్ చోరీకి పాల్పడటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటుగా మారిందని రోజా ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషితోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగిందని సంబంధిత కాంట్రాక్ట్ పొందిన జీఎమ్మార్ సంస్థ చెప్తున్నా, చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. తన కృషిగా నిస్సిగ్గుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు నెల్లూరు, కుప్పంలో ఎయిర్‌పోర్టులను నిర్మిస్తానని ప్రకటించిన చంద్రబాబు, అక్కడ ఎందుకు జరపలేకపోయారని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని రామ్మోహన్‌నాయుడ్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబును దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారు..?
రాయలసీమలో పుట్టానని చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. సాగునీటి విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నా రని రోజా ప్రశ్నించారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని చెప్తున్న ఆయన.. రాయలసీమ విషయంలో చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల మన్ననలు పొందిన కుటుంబం
మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన ఫ్యామిలీ పిన్నెల్లి కుటుంబానిది అని అంబటి మురళి పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందేవారని తెలిపారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండటంతో అభ్యర్థిని ప్రతి ఎన్నికల్లో మార్చేదన్నారు. అక్కడ ఎలాగైనా పట్టుసాధించాలనే ఉద్దేశంతో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించిందని ఆరోపించారు.


