ఇంకెంతకాలం ఎదురుచూడాలో?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఒకప్పుడు నెల్లూరంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పేరు ప్రముఖంగా వినిపించేది. 1979లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు రైతుల విజ్ఞప్తి మేరకు కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2013 వరకు నిరంతరాయంగా నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట మండలాల చెరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. సమీప నియోజకవర్గాలైన నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో చెరకు పండించే రైతులు లాభాలు ఆర్జించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన షుగర్ ఫ్యాక్టరీ నష్టాల పేరుతో మూతపడటం, బకాయిలు చెల్లించకపోవడంతో అటు కార్మికులు, ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలమందికి ఉపాధి
ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించింది. ప్రత్యక్షంగా 600 నుంచి 700 మంది వరకు పని చేసేవారు. పరోక్షంగా 5 వేల మంది రైతులు, చెరకు కట్‌చేసే కార్మికులు, మరో మూడువేలమందికి నాలుగైదు నెలలపాటు ఉపాధి దొరికేది. అంతేకాకుండా ఎద్దుల బండ్ల రైతులు, ట్రాక్టర్లు, లారీలు కలిగిన వారు ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా ఉపాధి పొందేవారు. అప్పట్లో రైతులకు ఫ్యాక్టరీ ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా ఖాతాలు తెరచి ముందస్తు రుణాలు కూడా అందించేవారు. సన్నకారు రైతులు, నిరుపేద కూలీలకు చెందిన దాదాపు 10 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగించేవి.
నష్టాల పేరుతో..
కాలక్రమేణా నిర్వహణ ఖర్చులు, జీతాలు తదితర ఖర్చులు పెరిగాయని ప్రభుత్వాలు ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో మూతపడింది. 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో నష్టాల పేరుతో మూతపడేలా చేశారు. 2019 సంవత్సరంలో ఏర్పాటైన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకు కమిటీని కూడా నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం చెరకు సాగు తగ్గి, చేపలు, రొయ్యలు తదితర ఆక్వా ఉత్పత్తుల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించింది. ఈలోగా 2024కు సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు వీలు పడలేదు.
ఎప్పుడిస్తారో?
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి రాగానే ఆ హామీని పక్కన పెట్టేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని అనేకసార్లు కార్మికులు కలిశారు. రూ.23 కోట్ల బకాయిల విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి నిధులు విడుదలయ్యేలా చూడాలని విన్నవించుకున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ విషయమై ఆమె ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దాదాపు 20 నుంచి 30 ఏళ్ల వరకు ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన బకాయిలు ప్రభుత్వ వెంటనే చెల్లించేలా నెల్లూరు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే చొరవ చూపాలని కా ర్మికులు కోరుతున్నారు.
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ
పాపం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
ఎన్నికల హామీ నెరవేర్చని
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
అందాల్సిన బకాయిలు రూ.23 కోట్లు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


