గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు నగరంలో గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొ మ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ 40 ఏళ్లకు గిరిజన మహిళకు మేయర్ పదవి దక్కితే దానిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేయడం దారుణమన్నారు. ఇదేనా రాజ్యాంగాన్ని గౌరవించడమని ప్రశ్నించారు. మేయర్ పదవిని మరో గిరిజన మహిళకు ఇస్తామని రూప్‌కుమార్ యాదవ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆయన ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకొని ఆ విషయాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణశేఖర్, ఏకశిరి మురళి, సుధీర్‌బాబు, సేవూరి శ్రీనివాసులు, మైనంపాటి లక్ష్మి, లక్ష్మి, పద్మ, కమతం శీనయ్య, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు.


