చీటింగ్ కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఫ్రాంచైజర్లను మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది ప్రస్తుతం నెల్లూరు శ్రీహరినగర్‌లో నివాసముంటున్న బి.విజయ్‌కుమార్ ఎండీగా, కర్నూలుకు చెంది ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న ఎ.మహేంద్రకుమార్, తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్.సునీల్‌లు మేనేజర్లుగా ఆరునెలల క్రితం మాగుంటలేఅవుట్‌లో విహాన్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించారు. సంప్రదాయ పిండివంటలు, మిఠాయిలు అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో పలువురు డిపాజిట్లు చెల్లించి ఫ్రాంచైజ్‌లను తీసుకున్నారు. కొంతకాలంగా ఉత్పత్తులు పంపకపోవడం, నగదు ఇవ్వకపోవడంతో నెల్లూరు నగరానికి చెందిన ఫ్రాంఛైజర్ మనోజ్‌కుమార్‌తోపాటు 17 మంది మూడు రోజుల క్రితం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు మోదు చేశారు. మంగళవారం ఎండీతోపాటు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


