ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలి
● వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీపీ ఎన్నికను అధికార పార్టీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మకై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అక్రమంగా నిర్వహించారని, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. వింజమూరులోని బంగ్లా సెంటర్‌లో సోమవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసులు పథకం ప్రకారం తమ ఎంపీటీసీలను సమావేశ మందిరం వద్దకు వాహనాల్లో రానీయకుండా కాలినడకన నడిపించి తమ ఎంపీటీ పీ మల్లికార్జున కిడ్నాప్‌కు సహకరించారన్నారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా జరపనందున వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ అభ్యర్థి, జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమ సభ్యులను కిడ్నాప్ చేయడమే కాకుండా తమను సమావేశ మందిరంలోకి అనుమతించలేదన్నారు. ఎన్నిక సమయం ముగిసే రెండు నిమిషాల ముందు (11.58గంటలకు) ఒక ఎంపీటీసీని దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి తలుపులు మూసి ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయడం అప్రజాస్వామికమన్నారు. దీనికి అధికారులు పూర్తిగా సహకరించినందున కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ షేక్ అలీఅహ్మద్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి 8 మంది ఎంపీటీసీల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. అయినా తమ ఎంపీటీసీని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఇందుకు పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. టీడీపీ వారే దౌర్జన్యానికి పాల్పడి ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి గెలిచే బలం లేకపోయినా అక్రమాలకు పాల్పడిందన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌పీపీ మండలాధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి, నేతలు మద్దూరి బాబు, కాటం రవీంద్రరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, పోలిబోయిన వెంకటేశ్వర్లు, డబ్బుకొట్టు రమణయ్య, బండి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు డేగా వంశీ, భవానీ, ఉంటా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


