టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే వర్గీయులపై మాలేపాటి వర్గీయుల దాడి
దగదర్తి : దగదర్తి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం రాత్రి కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి వర్గానికి చెందిన కడియాల సురేష్ ఇంటిపై మాలేపాటి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా సురేష్‌ను రోడ్డుపైకిలాగి వీధుల్లో తరిమితరిమి దాడికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటి వరకు మాలేపాటి వర్గంలో ఉన్న వడ్డే శ్రీకాంత్‌నాయుడు వారిని విభేదించి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండదండలతో టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌నాయుడును మాలేపాటి సోదరులు రవీంద్రనాయుడు, సుధాకర్‌నాయుడు అనుచరులు తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుధాకర్‌నాయుడుకు శ్రీకాంత్‌నాయుడు వర్గానికి చెందిన కడియాల సురేష్ ఫోన్ చేసి ఆయనతో పాటు ఆయన భార్యను కించపరుస్తూ నానా దుర్భాషలాడి బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న మాలేపాటి వర్గీయులు సురేష్ ఇంటిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఇంటి తలుపులు, అద్దాలతో పాటు గృహోపకరణాలను ధ్వంసం చేశారు. కడియాల సురేష్‌ను బయటకు లాగి వీధుల్లో తరిమితరిమి దాడి చేశారు. దీంతో సురేష్ తలకు తీవ్ర గాయమైంది. సురేష్‌పై దాడి చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అడ్డుకునేందుకు వచ్చిన వడ్డే శ్రీకాంత్‌నాయుడు, సోదరుడు వినయ్‌పైన దాడికి దిగారు. దీంతో వారు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుమణిగించారు. గాయపడిన సురేష్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దగదర్తిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పికెట్ ఏర్పాటు చేశామని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు


