ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉదయగిరి: వింజమూరు ఎంపీపీ ఎన్నికలో అధికార టీడీపీ దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వింజమూరులో ఎంపీపీ ఎన్నిక జరిగిన తీరుపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీకి 8 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో కిడ్నాప్, దౌర్జన్యాలు, కుట్రలు చేసి ఎంపీపీ పదవిని పొందడం సిగ్గుచేటు అన్నారు. ఉదయగిరి రాజకీయ చరిత్రలో ఎన్నడూ కిడ్నాప్‌లు లేవన్నారు. టీడీపీ నేతలు నాటుతున్న ఈ విషబీజం మానై భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదన్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి, మరో మహిళా ఎంపీటీసీని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి తాము విజయం సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఈ ఎన్నికలో టీడీపీ విజయం సాధించామని చెప్పుకున్నా, నైతికంగా తమ పార్టీ విజయం సాధించినట్లేనన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న తమ పార్టీ ఎంపీటీసీలు, నేతలకు భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామన్నారు. ఈ అరాచక చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నేతలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.


