విమానాశ్రయ భూములకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి
● కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
కావలి(అల్లూరు): దగదర్తి విమానాశ్రయ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులు తమకు రెట్టింపు పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013 భూపరిహార చట్టం కింద తమ భూములకు ఎకరాకు రూ.13లక్షల పరిహారాన్ని అందజేయడం అన్యాయమన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి కుటుంబంలోని అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ ప్రస్తుత రేట్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామసభ పెట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులురెడ్డి, కే చంద్ర, బీ వెంకయ్య, మాలేపాటి గణేష్ నాయుడు, మక్కినేని వెంకయ్య, నెల్లూరు రమణారెడ్డి, జే శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


