ఇదే ఆఖరి అవకాశం
● పన్నులు చెల్లించండి
నెల్లూరు(బారకాసు): పన్నులకు సంబంధించి మొండి బకాయిలున్నవారు ఆఖరి అవకాశంగా భావించి వెంటనే చెల్లించాలని కమిషనర్ నందన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి ఆస్తులను జప్తు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 15,737 అసెస్‌మెంట్ల నుంచి చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం రూ.108.82 కోట్లన్నారు. ఇది 10 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పరిధిలో జమ కావాల్సి ఉందని, మొండి బకాయిలను వసూలు చేయడానికి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలియజేశారు. రూ.10 వేలకు పైగా బకాయిలున్న వారికి నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదన్నారు. దీంతో కారణాలు తెలుసుకునేందుకు బకాయిదారులతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
● వాహనాల స్వాధీనం
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని టిడ్కో గృహాల వద్ద డీఎస్పీ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 1,028 గృహాలున్న ఈ ప్రాంతంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు సెర్చ్‌లో పాల్గొని ఆధార్‌కార్డులు పరిశీలించారు. సరైన పత్రాల్లేని రెండు కార్లు, నాలుగు ఆటోలు, 30 మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు జి.గంగాధర్, శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు ఎస్‌కే జిలానీ, బి.సాయిప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్రాక్టర్ కింద పడి..
● వ్యక్తి మృతి
సోమశిల(చేజర్ల): పేద కుటుంబానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తు మినీ ట్రాక్టర్ కిందపడి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి (35) అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. కోళ్ల ఫారం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మరొకరి పొలంలో మినీ ట్రాక్టర్‌తో బురద దుక్కి దున్నతుండగా ప్రమాదవశాత్తు దాని కిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. దస్తగిరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించిన మాజీ విద్యార్థి సంఘ నేతపై నెల్లూరు సంతపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సోమవారం వారు వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్‌కు చెందిన ఎం.పెంచలయ్య నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీన అతను కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం విషయమై అర్బన్ తహసీల్దార్‌తో మాజీ విద్యార్థి సంఘ నేత జీవీ ప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. గమనించిన ఇన్‌చార్జి ఆర్‌ఐ గొడవ చేయొద్దని ప్రసాద్‌ను వారించాడు. దీంతో ప్రసాద్ సదరు ఆర్‌ఐని కులం పేరుతో దూషించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించాడు. బాధిత ఉద్యోగి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
కండలేరులో
61.290 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 61.290 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,200 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 700, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.
10, 11 తేదీల్లో
పక్షుల పండగ
దొరవారిసత్రం: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే పక్షుల పండగకు నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసే సందర్శకుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ, పక్షుల పండగ ప్రత్యేకాధికారి భానుప్రకాష్‌రెడ్డి ఆదేశించారు. పక్షుల కేంద్రంలో సోమవారం అన్ని శాఖల మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాన్ని సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, అటవీ శాఖలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.


