మీరైనా న్యాయం చేయండి
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 124 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండి’ అని పలువురు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 124 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ అజిత వేజండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌లు భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడు. ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులతో కలిసి బెదిరిస్తున్నాడని కావలికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● నా ఫోన్ నంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అర్ధరాత్రుల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నూరుల్లా అనే వ్యక్తి అన్నలా ఉండేవాడు. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మూడునెలల నుంచి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సైతం తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని పొదలకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం సమర్పించారు.
● వినోద్ అనే వ్యక్తితో నాకు వివాహమైంది. రెండునెలల తర్వాత అతను కువైట్‌కు వెళ్లాడు. వీసా పంపి నన్ను తీసుకెళ్తానని నమ్మబలికాడు. మూడు సంవత్సరాలైనా తీసుకెళ్లలేదు. ఈ విషయమై ప్రశ్నించగా భర్త, అత్తింతివారు రూ.10 లక్షల అదనపుకట్నం తీసుకుని వస్తేనే కువైట్‌కు తీసుకెళ్తామని చెబుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని గూడూరుకు చెందిన ఓ మహిళ కోరారు.
● భర్త అనుమానిస్తూ నా వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● నాకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. నా భర్త ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కనుగొని అప్పగించాలని చిల్లకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.


