పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
చిల్లకూరు: పిల్లలకు గురుకుల పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి కుటుంబం, ప్రజా సంఘాల నాయకులు కలిసి సోమవారం చిల్లకూరు బాలుర గురుకుల పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ అనిల్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. సుధాకర్ వివరాలు వెల్లడించారు. తన కుమారుడు అరవింద్ ఆరో తరగతి చదువుతున్నట్లు చెప్పారు. ఆదివారం పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్ల వద్దకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అరవింద్‌కు మత్తు ఇచ్చాడన్నారు. దీంతో అతను గంటకు పైగా అక్కడే ఉన్నాడని, మెలకువ వచ్చాక 9వ తరగతి విద్యార్థులు గుర్తించి తరగతి ఇన్‌చార్జికు సమాచారం ఇచ్చారన్నారు. అరవింద్‌ను గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం తమకు సమాచారం అందించారని ఆరోపించారు. తాము గురుకులానికి వచ్చి పిల్లవాడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రిన్సిపల్, టీచర్లు పర్యవేక్షణ చేయకపోవడం దారుణమని విమర్శించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
ప్రిన్సిపల్ మాట్లాడుతూ అరవింద్‌కు వైద్యం చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో సుధాకర్ స్పందించి తమ బిడ్డను కొద్దిరోజులపాటు ఇంటికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థి చెప్పిన విషయంపై గురుకులం సిబ్బంది దృష్టిసారించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ నాయకుడు వెంకటేశ్వర్లు కోరారు.


