రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని 36 బ్లాక్‌స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలపై సోమవారం నెల్లూరు పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్లాక్‌స్పాట్లలో స్పెషల్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. వాహనదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో హెచ్చరిక బోర్డులు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యసేవనం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫేస్ వాష్ కార్యక్రమాన్ని రాత్రివేళల్లో నిర్వహించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా ప్రామాణికత కలిగిన హెల్మెట్లను ధరించాలన్నారు. అతివేగం ప్రమాదాకరమని, ఇంటివద్ద తమ కోసం కుటుంబ సభ్యలు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


