చమురు నిక్షేపాలు కొల్లగొట్టేందుకే దాడి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వెనెజువెలా దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. సీపీఎం జిల్లా సెక్రటేరియల్ సభ్యుడు మోహన్‌రావు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి వీరమరాజు, సీపీఐ ఎంఎల్ నాయకుడు కె.రాంబాబు మాట్లాడారు. దాడిని ఖండిస్తూ మంగళవారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అంతర్జాతీయ కోర్టు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ భద్రతా మండలి న్యాయసూత్రాలకు విరుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. వెనెజువెలా ఘటనను ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం ఖండించకపోవడం దారుణమన్నారు. మదురోను వెంటనే విడుదల చేసి అంతర్జాతీయ కోర్టులో ట్రంప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజాతంత్రవాదులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, దయాకర్ పాల్గొన్నారు.


