నేడు వింజమూరు ఎంపీపీ ఎన్నిక
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో కొందరు టీడీపీ, వైఎస్సార్‌సీపీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నిక సమయానికి రెండు శిబిరాల్లోని ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది. ఎంపీపీ ఎన్నికలో మాజీ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ప్రస్తుత తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్య ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీరి ఓటింగ్‌పైన ఆధారపడి ఫలితం ఉండనుంది. మొత్తం మీద ఎంపీపీ కుర్చీలో టీడీపీకి చెందిన వనిపెంట హైమావతి లేక వైఎస్సార్‌సీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి కూర్చుంటారా లేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్యని వరిస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ నూతన కార్యాలయ ప్రారంభం
ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విజయవాడలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆ కంపెనీ సీఈఓ జన్మేజయ మహాపాత్ర ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో హెచ్‌ఆర్ హెడ్ బ్రిగేడియర్ సీహెచ్‌డీ శంకర్‌ప్రసాద్, అడ్మిన్, ఈఆర్‌హెచ్ జీఎన్ రఘురామ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన మొత్తం 2,640 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైన భాగాన్ని రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తమ కొత్త కార్యాలయం ద్వారా రాష్ట్రంలో తమ కంపెనీ ఉనికి మరింతగా బలోపేతమై వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు చెప్పారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన మోదేపల్లి కృష్ణప్రసాద్, రాధ, కుమారుడు జయసింహలు రూ 1,00,116 విరాళాన్ని ఆదివారం అందజేశారు. వీరికి దేవస్థాన ఏసీ శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
సొంత పార్టీ నేతలపైనే కాకర్ల విసుర్లు
నెల్లూరు సిటీ: సొంత పార్టీ నేతలపైనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తనను అప్రతిష్ట పాల్జేసేందుకు అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. అందులో భాగంగానే వెంగమాంబ అనే మహిళ వీడియోను విడుదల చేశారని, దీని వెనుక నాటకదారులు, సూత్రధారులు ఎవరో తేలుస్తానని హెచ్చరించారు. తనపై చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటుండడాన్ని చూసి ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని నిందలు వేయాలని చూస్తున్నారన్నారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసిన వెంగమాంబ సెప్టెంబర్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు వెళ్లిన క్రమంలో పరిచయమైందన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయాలని ఉందని చెప్పడంతో అంగన్‌వాడీ కోఆర్డినేటర్‌గా నియమించామని తెలిపారు. అయితే విజయవాడలో ఆమెను ఉపయోగించి తనపై కుట్రకు యత్నించినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళ విషయం కాబట్టి అక్కడితో వదిలివేశానన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తానన్నారు. తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోనని, అటువంటి వారిపై చట్టపరంగా వెళ్తానని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌సీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చేజర్ల మల్లికార్జున, మద్దసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేడు వింజమూరు ఎంపీపీ ఎన్నిక


