కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు

Jan 5 2026 11:17 AM | Updated on Jan 5 2026 11:17 AM

కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు

కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు

తప్పుల తడకలుగా పాస్‌ పుస్తకాలు

పది మంది రైతుల పాస్‌ బుక్స్‌లో

ఒకే వ్యక్తి ఫొటో

జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షలు మంజూరు

నెల్లూరు (దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం మరోసారి గొప్పలకు పోయి రైతులకు మళ్లీ తిప్పలు తెచ్చింది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పాస్‌ పుస్తకాల్లో తప్పులు దొర్లాయంటూ నానా హంగామా సృష్టించి తాము అధికారంలోకి వస్తే తప్పులు లేని పాస్‌ పుస్తకాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. కూటమి మళ్లీ అవే తప్పులతో పాసు పుస్తకాలను రాజముద్ర వేసి మరీ రైతులకు అంటగడుతూ ఏదో ఇచ్చేశామంటూ చెప్పుకొస్తూ రైతులను మరింత ఇబ్బందులకు గురి చేసింది. గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన సమయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన భూముల వివరాల నమోదులో తప్పులకు పాల్పడ్డారు. వీటిని సరిచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంది.

తప్పులు సరిదిద్దకుండానే..

రీ సర్వే చేసిన గ్రామాల్లో రైతుల భూముల వివరాల నమోదులో జరిగిన తప్పులను సరిదిద్దకుండానే పాస్‌పుస్తకాలు మంజూరు చేయడంతో రైతులు ఏ విధంగానూ ఉపయోగం లేకుండా పోతున్నాయి. తమ హక్కులు కోల్పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాల్లో ఒకే ఫొటోతో పదుల కొద్దీ పాసుపుస్తకాలు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం తన ఆర్భాటాన్ని ప్రదర్శించేందుకు రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.

328 గ్రామాల్లో రీ సర్వే

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో 737 గ్రామాలకు గాను 328 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో దాదాపు 1.13 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. అయితే రీ సర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లు, విస్తీర్ణం, సబ్‌ డివిజన్లు లేకపోవడం, ఆసైన్డ్‌, చుక్కల భూములు, సర్వీస్‌ ఇనాం ఇలాంటి అనేక కాలమ్స్‌ తప్పుగా రావడంతో రైతులు వీటన్నింటిపై నూతన ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. అయితే వీటన్నింటిని సరి చేయకుండానే కూటమి ప్రభుత్వం పాత డేటాతోనే కొత్తగా పాసు పుస్తకాలు ప్రింట్‌ చేయించి రైతులకు మంజూరు చేస్తుండడంతో వీటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదంటూ రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే వ్యక్తి ఫొటో 10 పుస్తకాల్లో..

జిల్లాలోని దగదర్తి మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో 9 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయింది. ఇందులో లింగాలపాడులో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన పాసు పుస్తకాల్లో ఒకే వ్యక్తి ఫొటో 10 పాసుపుస్తకాల్లో రావడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీంతో అధికారులు వాటిని సరిచేసి ఇస్తామంటూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో వాటిని రైతులకు అందజేయకుండానే తీసుకుంటున్నారు. దీనిపై దగదర్తి తహసీల్దారు టీ కృష్ణను వివరణ కోరగా ఇలా ఒక వ్యక్తి ఫొటో 10 పాసు పుస్తకాల్లో వచ్చింది నిజమేనంటూ వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement