ఉప్పు సాగు బంద్
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం పంచాయతీ గోపాలపురంలో ఉప్పు సాగు నిలిచిపోయింది. బ్రిటిష్ హయాం నుంచి ఉత్పత్తి ఉండగా.. దశాబ్దం క్రితం వరకూ కళకళలాడింది. అయితే కృష్ణపట్నం పోర్టు వెదజల్లుతున్న బొగ్గు, దుమ్ము, ధూళి కాలుష్యం కారణంగా సాగు బంద్ అయింది. దీనిపై ఆధారపడిన సుమారు 1,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 700 ఎకరాల్లో ఉప్పు కయ్యలు వర్షపునీటితో నిండిపోయాయి. పోర్టు యాజమాన్యం ప్రతి ఏడాది సాల్ట్ లీజుదారులకు అందజేస్తున్న జీవనభృతి మాకు అందజేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంతోమందికి ఆధారం
ఉప్పు ఉత్పత్తి వెయ్యిమంది కూలీలకు ఆధారంగా ఉండేది. కృష్ణపట్నం, గోపాలపురం, చలివేంద్రం, బలిజపాళెం, సుబ్బారెడ్డిపాళెం, పాదర్తిపాళెం, శంభునితోపు గ్రామాలకు చెందినవారు పనికి వెళ్లేవారు. కాలుష్యం కారణంగా కూలీలు వీధినపడ్డారు. అప్పట్లో సేద్య కాపులు మడవ కట్టి తొక్కుడు తొక్కి ఉప్పు మోసేవారు. కొలత, కువ్వ తట్టడం, ప్యాకింగ్ తదితర పనులుండేవి. ఇందుకోసం గుమస్తాలు దగ్గరుండి లోడ్ చేసి ఎగుమతి చేశారు. గోపాలపురంలో సాల్ట్ కార్యాలయం కూడా ఉండేది. అది నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రతి ఏడాది ఏడునెలలపాటు ఈ ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగు పూర్తిగా లేకపోవడంతో చాలామంది సరైన పనుల్లేక ఖాళీగా ఉంటున్నట్టు వెల్లడిస్తున్నారు. వయస్సు పైపడిన వారు కావడంతో పోర్టులో సైతం పనులు ఇవ్వడం లేదంటున్నారు. పూటగడవటం కూడా కష్టంగా మారిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్యాకేజీ అందజేయాలి
ఉప్పు రైతులు తమ భూములను పోర్టుకు అప్పగించారు. అయితే ఆ పరిశ్రమను నమ్ముకుని జీవించే వందలాది మంది కార్మికులు మాత్రం పనుల్లేక పస్తులు ఉంటున్నారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకుని వెళ్లడంతో పోర్టు యాజమాన్యం ప్యాకేజీ అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజీ అందలేదని వారు చెబుతున్నారు. పోర్టు యజమాన్యం ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యిందికి పైగా ఎదురు చూస్తున్నారు. నవయుగ ఆధ్వర్యంలో పోర్టు నడిచే సమయంలో వారు కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఉప్పు పరిశ్రమ రైతులకు పోర్టు యాజమాన్యం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు.
గతంలో 700 ఎకరాల్లో సాగు
నేడు బీడుగా మారిన భూములు
దశాబ్ద కాలంగా ప్యాకేజీ కోసం
కార్మికుల నిరీక్షణ
ఉపాధి కోల్పోయిన వెయ్యి మంది
గోడు వినాలని పోర్టు
యాజమాన్యానికి విజ్ఞప్తి
ఉప్పు సాగు బంద్
ఉప్పు సాగు బంద్


