డయల్ యువర్ ఎస్‌ఈ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని సోమవారం విద్యుత్ భవన్‌లో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రాఘవేంద్రం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 0861 – 2320427 నంబర్‌కు వినియోగదారులు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
మాదకద్రవ్యాలకు
వ్యతిరేకంగా పోరు
● జేవీవీ నాయకులు
నెల్లూరు(అర్బన్): ప్రశాంతంగా ఉన్న జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిన మాదకద్రవ్యాలు, మత్తు మందులు, గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ తెలిపారు. ఆదివారం నెల్లూరు హరనాథపురంలోని జేవీవీ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్యను గంజాయి మూకలు హత్య చేయడం దారుణమన్నారు. ఇలాగే ఉంటే సమాజం తిరోగమనంలో నడుస్తుందన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలతో కలిసి మత్తు మందులు, గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తీర్మానించామన్నారు. అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు మోహన్‌రెడ్డి, డాక్టర్ కాలేషాబాషా, హెచ్‌ఎం ఎంవీ చలపతి, డాక్టర్ రఫీ, బుజ్జయ్య, నగర కార్యదర్శి కృష్ణ, ఉదయభాస్కర్, మాదాల రాము, విద్యాచరణ్, పోలయ్య, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. చైతన్యపురి కాలనీలో మురళీకృష్ణ కుటుంబం నివాసముంటోంది. అతని తల్లి ధనమ్మ (66)కి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్‌తో ఆమె బాధపడుతూ వాటికి మందులు వాడుతోంది. ప్రతి చిన్న విషయానికి అందరిపై కోప్పడేది. ఆరోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఆమె చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులకు చెప్పగా వారు సర్ది చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 3వ తేదీన ఆమె బాత్‌రూమ్‌లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. బాధిత కుమారుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
మహిళపై బ్లేడ్‌తో దాడి
● హత్యాయత్నం కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): వివాదం వద్దని సర్దిచెప్పిన ఓ మహిళపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసిన మరో మహిళపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. రంగనాయకులపేట ఉప్పరపాళెంలో నివాసముంటున్న రాజేశ్వరి, కీర్తిల మధ్య డ్రెయినేజీ నీరు వెళ్లే దారి విషయంలో వివాదం ఉంది. ఈనెల మూడో తేదీన వారి మధ్య గొడవ జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి, మరికొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో గొడవ ఆగిపోయింది. కీర్తి పాత గొడవను మనసులో పెట్టుకుని ఆదివారం రాజేశ్వరిపై దాడి చేసింది. అడ్డువెళ్లిన కృష్ణవేణి కుడిచేతి చిటికిన వేలును కొరికి చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆమె తన భర్త, రాజేశ్వరి, లక్ష్మీలతో కలిసి సంతపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా కీర్తి అడ్డుకుంది. కృష్ణవేణిపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడిచేసి పరారైంది. ఎడమ చెంపపై తీవ్రగాయమైన కృష్ణవేణిని ఆమె భర్త, అక్కడున్నవారు వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


